Thursday, September 22, 2005

గురువులకు గురువు అబ్దుల్‌ కరీమ్‌ ఖాన్‌

డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌
ఉస్తాద్‌ అబ్దుల్‌ కరీమ్‌ఖాన్‌

కచేరీలో కరీమ్‌ఖాన్‌

సవాయా గంధర్వ, కరీమ్‌ఖాన్‌

పాత దేవదాస్‌ సినిమాలోని ఒక సన్నివేశంలో కె.ఎల్‌.సైగల్‌ తాగి వీధుల వెంట పడి "పియా బిన్‌ నహీఁ ఆవత్‌ చైన్‌" అనే ఒక ఠుమ్రీ పంక్తి పాడతాడు. అది ఝంఝూటి (ఉత్తరాదివారు రిXంఝోటీ అంటారు) రాగం. దాన్ని మొదట పాడినది ఉస్తాద్‌ అబ్దుల్‌ కరీమ్‌ఖాన్‌. జగత్ప్రసిద్ధమైన కిరానా ఘరానా (సంప్రదాయాని)కి వ్యవస్థాపకుడుగా పేరుపొందిన కరీమ్‌ ఖాన్‌ 1872లో ఒక సంగీతకారుల వంశంలో జన్మించారు. ఆయన జన్మస్థలమైన కిరానా పంజాబ్‌ ప్రాంతంలోని కురుక్షేత్రలో ఉంది. 1937లో కాలం చేసిన ఈ గాయకుడి మరణవార్త విన్న రవీంద్రనాథ్‌ ఠాకుర్‌ సంతాపం ప్రకటిస్తూ "ఆయన పాడినదంతా సంగీతమే" అన్నారట. మరొక గొప్ప గాయకుడు ఫయ్యాజ్‌ఖాన్‌ "హిందుస్తాన్‌ సే సుర్‌ మర్‌గయా" (భారతదేశపు స్వరమే మరణించింది) అన్నారట.

కరీమ్‌ ఖాన్‌ కుటుంబం మొదట సారంగీ వాద్య సంప్రదాయానికి చెందినది; ప్రసిద్ధ వైణికుడు ఉస్తాద్‌ బందే అలీఖాన్‌, గ్వాలియర్‌ సంప్రదాయానికి చెందిన ఖయాల్‌ గాయకద్వయం హస్సూ, హద్దూ ఖాన్‌ తదితరులతో వియ్యమందినటువంటిది. కరీమ్‌ ఖాన్‌కు మొదట ఆయన తండ్రి కాలేఖాన్‌, తండ్రికి సోదరుడైన అబ్దుల్లాఖాన్‌లు సంగీతం నేర్పారు. హైదరాబాద్‌ నిజాం సంస్థానంలో పనిచేసే మరొక బంధువు నన్హేఖాన్‌నుంచి ఆయనకు సంప్రదాయ సంగీతపు మెళుకువలు పట్టుబడ్డాయ. చిన్నతనంనుంచీ గొప్ప ప్రతిభ కనబరిచిన కరీమ్‌ పాటతోబాటు వీణ, సితార్‌, తబలా, జలతరంగం, సారంగీ, నగారావంటి వాయద్యాలను కూడా బాగా వాయంచేవాడు. ఆయన వీణమీద వాయంచిన దర్బారీ, పిలూ రాగాల రికార్డులు కూడా వెలువడ్డాయట. (ఆయన రేడియోలో వీణ వాయంచడం మా నాన్నగారు విన్నారట).

కిరానా సంప్రదాయపు మరొక దిగ్గజం అబ్దుల్‌ వహీద్‌ఖాన్‌. కరీమ్‌ ఖాన్‌ మొదట అబ్దుల్‌ వహీద్‌ఖాన్‌ సోదరి గఫూరన్‌ బీబీని పెళ్ళాడి తరవాత వదిలెయ్యడంతో వారిద్దరికీ విరోధం ఏర్పడిందట. అబ్దుల్‌వహీద్‌ఖాన్‌ లాహోర్‌లోనే ఉండి ఇదే బాణీలో బేగం అఖ్తర్‌ తదితరులకు సంగీతం నేర్పాడు. ఆయనవల్ల గొప్పగా ప్రభావితుడైన మరొక మహా గాయకుడు ఇందోర్‌కు చెందిన అమీర్‌ఖాన్‌.

కరీమ్‌ఖాన్‌ తన పదకొండో ఏట మొదటి కచేరీ చేశారట. తొలి దశలో కరీమ్‌ఖాన్‌ తన తమ్ముడు అబ్దుల్‌హక్‌తో కలిసి పాడేవారు. వీరిద్దరూ బరోడాలో సయాజీరావు గయక్వాడ్‌ మహారాజు దర్బారులో పటియాలా సంప్రదాయానికి చెందిన అలీబక్ష్‌ఫతేఅలీ సోదరులతో పోటీపడి నెగ్గారట. మొదట అలీబక్ష్‌ ఫతేఅలీలు అద్భుతంగా పాడిన బసంత్‌ రాగాన్ని అంతకంటే బాగా పాడిన కరీమ్‌ఖాన్‌ అబ్దుల్‌హక్‌ ద్వయం త్రిస్థాయలలో అద్వితీయంగా పాడి, తారస్థాయ షడ్జమంనుంచి పిలూ రాగంలోని "సోచ్‌ సమర్‌X నాదాన్‌" అనే తమ పాట అందుకున్నారట. ఎంతో ఆనందించిన మహారాజు వారిని తన ఆస్థానగాయకులుగా నియమించాడట.

బరోడాలో రాజమాతకు సోదరుడైన సర్దార్‌ మారుతీరావు మానే అనే అతని కుమార్తె తారాబాయకి కరీమ్‌ఖాన్‌ సంగీతం నేర్పడం మొదలెట్టాడట. త్వరలోనే వారిద్దరూ ప్రేమలో పడడంతో కరీమ్‌ఖాన్‌ సోదర ద్వయానికి బరోడానుంచి ఉద్వాసన తప్పలేదట. తరవాత బొంబాయలో వారి వివాహం జరిగిందట. వారికి పుట్టిన పిల్లలు హీరాబాయ, సురేశ్‌బాబు,సరస్వతి, కమలాబాయ.

బరోడానుంచి ఆయన బొంబాయ, మీరజ్‌ నగరాలకు వచ్చారు.ఆ తరవాత హూబ్లీ, ధార్వాడ వెళ్ళారు. అక్కడున్న తన సోదరుడు అబ్దుల్‌హక్‌తో కచేరీలు చేశారు. సవాయాగంధర్వ అక్కడే ఆయనకు శిష్యుడయారు. పాట్నా వెళ్ళినప్పుడు అక్కడ రోషనారాబేగం తల్లి ఆయనకు శిష్యురాలయంది. ఇలా వెళ్ళిన చోటల్లా ఆయనకు శిష్యవర్గం, అభిమానులు పెరగడం జరిగింది. 1913లో ఆయన పూనాలో ఆర్యసంగీత విద్యాలయం స్థాపించి, గురుకుల పద్ధతిలో పేదవిద్యార్థులకు ధన, వస్త్రదానాలు సైతం చేస్తూ, గాత్ర, వాద్య సంగీతాల్లో శిక్షణ నిచ్చారు. వారిని తన వెంట తీసుకెళ్ళి ప్రదర్శన లిప్పించారు. వాద్యాలకు మరమ్మత్తు చెయ్యడానికి ఆయన తన వెంట పనిముట్లను కూడా తీసుకెళ్ళి, వాద్యాలు చక్కగా మోగేట్టు చూసేవారట. ఎంతోకాలంగా సితార్‌, తంబురాల తయారీకి పేరుపొందిన మీరజ్‌కు ఆయన వెళ్ళినప్పుడు అక్కడి వృత్తి పనివారు ఆయన నైపుణ్యాన్ని గుర్తించి, ఆయన సలహాలను సగౌరవంగా స్వీకరించేవారట.
మొదట పటియాలా శైలి ప్రభావానికి గురైన కరీమ్‌ఖాన్‌ పాటలో వేగవంతమైన సంగతులతో విజృంభించే లక్షణం కనబడేదట. తరవాత కురుండ్‌వాడ్‌లో అతను రహమత్‌ఖాన్‌ పాట వినడం తటస్థించిందట. తత్ఫలితంగా మాల్‌కౌఁస్‌, సింధుభైరవివంటి రాగాలను అతి మృదువుగా, భావయుక్తంగా పాడడం అలవాటు చేసుకున్నారట. ఎడతెగని అభ్యాసం ద్వారా తన గొంతులో మార్దవంగా, శృతిశుద్ధంగా, వినసొంపుగా స్వరాలు పలికించడం నేర్చుకున్నారు. తబలా వాయంచగలిగినా విలంబిత్‌ ఖయాల్‌ను తాళప్రధానంగా కాక గమక భూయష్టంగా పాడసాగారు. ద్రుత్‌ ఖయాల్‌లో మాత్రం "బోల్‌తాన్‌"లు (సాహిత్యాన్ని లయ ప్రకారంగా విరవడం) పాడేవారు. మంద్రస్థాయలో ఎంతో అభ్యాసం చెయ్యడం వల్ల పదునెక్కిన కరీమ్‌ఖాన్‌గారి శృతి శుద్ధత ఎంత గొప్పదంటే ఆయన పాటను బట్టి తంబురా శృతి చేసుకునేవారట!

ఇరవయ్యో శతాబ్ద ప్రారంభంలో కరీమ్‌ఖాన్‌ ఒక తరాన్ని తన సంగీతంతో ఉర్రూతలూగించి, కొత్త సంప్రదాయానికి ప్రతీకగా నిలిచారు. ఆయన స్థాపించిన కిరానా సాంప్రదాయం ఖయాల్‌, ఠుమ్రీలు పాడే పద్ధతులలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. తక్కిన శైలులకు భిన్నంగా సంగీతాన్ని ఆహ్లాదకరంగా, ఒక చల్లని ఉద్యానవనంలో శ్రోతలు విహరిస్తున్న భావనను కలిగించేదిగా, హృద్యంగా, తాదత్మ్యత కలిగిస్తూ సాగే ఆయన గానం అందరినీ ఆకర్షించింది. ఈనాడు కేవలం ఆయన రికార్డుల్లో మనం వినేది కొందర్ని అంతగా ఆకట్టుకోకపోవచ్చునేమోగాని ఆయన కచేరీలు ప్రత్యక్షంగా విన్న అదృష్టవంతుల అభిప్రాయాలు చదివితే ఆయన ప్రతిసారీ తన గానంలో ఎప్పటికప్పుడు కొత్త పోకడలు వినిపించేవారని తెలుస్తోంది. అది విని ఆనందించిన వారికి ఆయన కొన్ని పాటలను పూర్తిగా పాడకపోయనా అభ్యంతరం ఉండేదికాదట! ఆయన సమక్షంలో విన్నదంతా దివ్యగానమే అనిపించేదట.
ఆయన తొట్టతొలిగా 1906లో పాడిన దుర్లభమైన రికార్డులు దొరికాయనీ, అప్పటి సాంకేతిక పద్ధతుల్లో వాటిమీద ఒక పక్కనే పాట రికార్డయ ఉందనీ ఈమధ్యనే పత్రికలలో వార్తలు వచ్చాయ.
కరీమ్‌ఖాన్‌ శిష్యపరంపర అసామాన్యమైనది. బరోడా సంస్థానంలో కొన్నాళ్ళు గడిపిన ఈ విద్వాంసుడు మహారా్రషలో స్థిరపడి ఎందరో శిష్యులను తయారు చేశాడు. ఆయన శిష్యవర్గంలో ప్రసిద్ధులైన సురేశ్‌బాబూ మానే, హీరాబాయ బడోదేకర్‌, ఆమె చెల్లెలు సరస్వతీ రాణే, వారివద్ద శిక్షణ పొందిన ప్రభా అత్రే తదితరులూ ఉన్నారు. బెహెరేబువా, బాలకృష్ణబువా కపిలేశ్వరి, దశరథ్‌బువా ముళే జయనకు శిష్యులు. రోషనారా బేగం (అబ్దుల్‌హక్‌ కుమార్తె) కూడా ఒక శిష్యురాలు. ఖాన్‌సాహెబుగారి మరొక శిష్యుడైన సవాయా గంధర్వ (రామ్‌భాఊ కుందగోళ్‌కర్‌) వద్ద గంగూబాయ హంగల్‌, బసవరాజ్‌ రాజ్‌గురు, ఫిరోజ్‌ దస్తూర్‌, భీమ్‌సేన్‌జోషీవంటి దిగ్గజాలు సంగీతం నేర్చుకున్నారు. (సవాయా గంధర్వ పేర ప్రతి ఏటా పూనాలో భీమ్‌సేన్‌జోషీ గత రెండు మూడు దశాబ్దాలుగా మూడు రోజుల సంగీతోత్సవం నిర్వహిస్తున్నారు) వీరుకాక ఈ శిష్యవర్గంలో జితేంద్ర అభిషేకీ, రసిక్‌లాల్‌ అంధారియా, కృష్ణా హంగల్‌, మాధవగుడి తదితరు లున్నారు.

కరీమ్‌ఖాన్‌ చివరకు మీరజ్‌లోనే స్థిరపడి, అక్కడినుంచి ఉత్తరాదికీ, దక్షిణాదికీ సంగీతయాత్రలు చేశారు. హైదరాబాద్‌కూ, మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాంతాలకూ వెళ్ళారు. ప్రతిచోటా అభిమానులు ఆయనను పూలహారాలతో సత్కరించి, చక్రవర్తిలాగా ఊరేగించేవారట. ఆయన మాత్రం నిరాడంబరంగా, సాధువులాగా జీవించారు. జీవితమంతా సంగీత తపస్విగా గడిపారు. ఇస్లాంను గౌరవిస్తూనే హిందూ మతాభిమానిగా తన కీర్తనలను "ఓం తత్సత్‌ సామవేదాయ నమః" అనే వాక్యంతో ప్రారంభించేవారట. ఆధ్యాత్మిక చింతన కలిగిన కరీమ్‌ఖాన్‌కు షిర్డీ సాయబాబాతోనూ, నాగపూర్‌లోని తాజుద్దీన్‌బాబాతోనూ పరిచయం ఉండేది. రాజా మాన్‌సింగ్‌కు సమకాలికుడుగా పదిహేనో శతాబ్దంలో జీవించిన తన పూర్వీకుడు నాయక్‌ ధోండూ గురించి ఆయన గర్వపడేవారట.
ఆయన అభిమానుల్లో లోకమాన్య తిలక్‌, గోపాల కృష్ణ గోఖలే, దక్షిణాదిలో టైగర్‌ వరదాచారి, వీణ ధనమ్మాళ్‌, ముత్తయ్య భాగవతార్‌ తదితరులుండేవారు. ఒక సభలో సర్‌ సి.వి.రామన్‌ సమక్షంలో ఆయన రెండు వీణల సహాయంతో 22 శృతులను వినిపించి, క్లెమెంట్స్‌ అనే బ్రిటిష్‌ సంగీతజ్ఞుడి సహకారంతో శృతి సంవాద్‌ అనే తన సిద్ధాంతాన్ని నిరూపించారట.
కరీమ్‌ఖాన్‌ సన్నగా, బలహీనంగా కనిపించినా ఎప్పటికప్పుడు వ్యాయామం చేస్తూ, మితాహారంతో ఆరోగ్యంగా జీవించారు. చేతిలో పొన్నుకర్ర, జరీ తలపాగా, అచ్‌కన్‌ కోటు, బుర్ర మీసాలతో ఆయన దర్జాగా ఉండేవారు. తన గొంతు విని మెచ్చుకున్న ఒక అభిమానికి తన చేతికర్ర పిడి వాడకంతో నునుపెక్కి ఉండటాన్ని ఉదాహరణగా ఆయన చూపారట. ఎప్పుడూ అర్ధనిమీలిత నేత్రాలతో పాడే కరీమ్‌ఖాన్‌ వాలకం గమనించిన ఆనీ బెసంట్‌కు అనుమానం వచ్చి, ఆయన మాదక పదార్థాలు పుచ్చుకుంటారా అని ఒక శిష్యుణ్ణి ప్రశ్నించిందట. అదంతా సంగీతాస్వాదనలోని మత్తు మాత్రమే అని అతను జవాబిచ్చాడట.
మరొక విశేషమేమంటే కరీమ్‌ఖాన్‌ కర్ణాటక రాగాలను అధ్యయనం చేసిన తొలి ఉత్తరాది కళాకారుడు. మైసూర్‌ సంస్థానపు సారంగీ విద్వాంసుడు హైదర్‌బక్ష్‌ కరీమ్‌ఖాన్‌ సోదరికి భర్త. అతని ద్వారా మైసూర్‌ సంస్థానానికి వెళ్ళిన కరీమ్‌ఖాన్‌కు కర్ణాటక సంగీతంతో పరిచయం కలిగింది. ఆయనకు వారి స్వరకల్పన పద్ధతి నచ్చి, స్వారాలు పాడే "సర్‌గమ్‌" హిందూస్తానీ సంగీతంలో ప్రవేశపెట్టారు. ఆయన ఖరహరప్రియ (ఆయన పాడిన రామ నీ సమానమెవరు రికార్డు ఉంది), సావేరి, హంసధ్వని, ఆభోగివంటి కర్ణాటక రాగాలు పాడారు. సరిగమలతో స్వరకల్పన చేశారు. రెండు పద్ధతుల మధ్య ఆరోజుల్లోనే సమన్వయానికి ప్రయత్నించారు. ఎంతో పేరు గడించిన తరవాత కూడా దక్షిణాదికి వెళ్ళి ఒక కర్ణాటక విద్వాంసుడి వద్ద వినమ్రతతో సంగీతం నేర్చుకున్నారు. ఆయన సంగీతం విన్న దక్షిణాది అభిమానులు చాలామంది హిందూస్తానీ సంగీతం పట్ల ఆకర్షితులై, అందులో ప్రవేశం పొందారు.
అభిమానులు వీడ్కోలు చెప్పగా మద్రాసునుంచి పాండిచ్చేరి వెళ్ళడానికి రైలెక్కిన ఆ మహాగాయకుడు మధ్యలో నలతగా అనిపించి దారిలో ఒక స్టేషన్‌లో దిగారట. దర్బారీ రాగంలో భగవద్య్ధానం చేసుకుని విశ్రమించి, మరి లేవలేదట. ఆయన భౌతిక కాయాన్ని మద్రాసుకూ, ఆతరవాత మీరజ్‌కూ తీసుకెళ్ళారట.
కిరానా శైలి లక్షణాలన్నిటినీ కరీమ్‌ఖాన్‌ గాత్రం వ్యక్తీకరిస్తుంది. సుఖంగా,భావస్ఫోరకంగా, కరుణరసం ఉట్టిపడేలా సాగే రాగ విస్తారానికి ఈ సంప్రదాయం పెట్టింది పేరు. కరీమ్‌ఖాన్‌ పాడుతూంటే ఆయన అంతరాత్మలోని ఉత్తమగుణాలన్నీ శబ్దరూపంలో ద్యోతకమయేవి. శ్రోతలు ఆనందాశ్రువులు రాల్చే రాగభావమూ, సున్నితమైన గమకాలూ, ఆర్తీ, ఆవేదనా ఆయన పాడిన అనేక రికార్డులలో మనం వినవచ్చు. సింధుభైరవిలో జమునా కే తీర్‌, రిXంఝోటిలో పియా బిన, జోగియాలో పియా కే మిలన్‌కీ ఆస్‌, (పంచమ్‌సే) గారాలో నైనా రసీలే, గోపాల కరుణా, ఇలా ఎన్ని ఉదాహరణలైనా ఉన్నాయ. ఠుమ్రీలూ,హోరీలేకాక, మరాఠీ నాటకాల్లోని పాటలు కూడా ఆయన పాడారు. గ్వాలియర్‌ శైలిలోనూ, తక్కిన సంప్రదాయాల్లోనూ సాహిత్యానికీ, లయకూ, స్వరాలకూ సమాన హోదా ఉంటుంది కాని కిరానా శైలిలో స్వరమే ముఖ్యం."తాల్‌ గయాతో బాల్‌ గయా. సుర్‌ గయాతో సర్‌ గయా" (తాళం తప్పితే వెంట్రుక రాలిందనుకోవచ్చు. స్వరం తప్పితే తల తెగినట్టే) అనే ఛలోక్తి కరీమ్‌ఖాన్‌దే నంటారు.
ఈనాటి గాయకులలో భీమ్‌సేన్‌ జోషీ లాగా ఎక్కువ ప్రజాదరణ పొందినవారు చాలామంది కిరానా సంప్రదాయానికి చెందినవారే. వారి ప్రతిభకు కారణభూతుడైన అబ్దుల్‌ కరీమ్‌ఖాన్‌ ఆధునిక హిందూస్తానీ సంగీతానికి పితామహుడివంటివాడు.

Tuesday, September 13, 2005

సంగీతానికి స్పందన

తబలా మాంత్రికుడు అహ్మద్ జాన్ థిరక్వా

సార్థక నామధేయుడు సంగీతరావు

ఘంటసాల ప్రతిభకు మచ్చుతునక కుంతీకుమారి

http://eemaata.com/issue37-unicode/kuntikumari.html

సంగీతరావుగారి చిన్ననాటి సంగతులు

ఓహో యాత్రికుడా!

శ్రుతిమించిన రాగం

మన శాస్త్రీయ సంగీతం

రాగాలూ స్వరాలూ

సంగీతరస పానశాల ఘంటసాల

సారంగీకి మారుపేరు పండిత్‌ రామ్‌నారాయణ్‌

రోహిణీప్రసాద్‌, రామ్‌నారాయణ్‌

శ్రుతిలయల నందనవనం

శృతినందన్‌ (కొల్‌కత్తా)
అజయ్‌ చక్రవర్తి


http://www.eemaata.com/issue24/srti.pdf

Prabha Atre

అసామాన్య సంగీతదర్శకుడు సుబ్బరామన్‌

పాటల్లో లయవిన్యాసాలు

సినిమా పాటల్లో తాళం నడకలు, విరుపులు

Bade Ghulam Ali Khan