Saturday, July 15, 2006
Friday, July 14, 2006
సితార్, సుర్‌బహార్‌ల ఉస్తాద్ ఇమ్రత్‌ఖాన్
డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
ఇమ్రత్‌ఖాన్
సుర్‌బహార్
సితార్ వాయించడంలో విలాయత్‌ఖాన్‌ను మించినవారు లేరని హిందూస్తానీ సంగీతాన్నీ, సితార్‌నూ బాగా ఎరిగిన చాలామంది అంటారు. వారి వంశం అక్బర్ పాదుషా కాలంనుంచీ ఎన్నోతరాలుగా సంగీతానికి పేరుపొందినది. విలాయత్‌ఖాన్ బాణీలో సితార్ వాయించే ఆయన తమ్ముడు ఇమ్రత్‌ఖాన్ అన్నగారి శిష్యుడే. ఈ అన్నదమ్ముల సంగీతం అక్షరాలా మూడు పువ్వులూ ఆరు కాయలైనట్టుగా వారి పుత్రుల, శిష్యుల ద్వారా వ్యాప్తిచెందుతోంది. విలాయత్‌ఖాన్ కుమారులు శుజాత్, హిదాయత్, ఇమ్రత్‌ఖాన్ కుమారులు నిషాత్, ఇర్షాద్, వజాహత్, షఫాతుల్లాలే కాక విలాయత్ మేనల్లుడు రయీస్‌ఖాన్, ఆయన బాబాయికి మనమడైన షాహిద్‌పర్వేజ్‌లు ఈ శైలికి అద్భుత ప్రతీకలుగా ఉన్నారు. ఇదే బాణీలో శిక్షణ పొందిన బుద్ధాదిత్య ముఖర్జీ, అరవింద్ పారిఖ్ వంటివారు కూడా మంచి కళాకారులే. రవిశంకర్ శిష్యులు చాలామంది పై విలాయత్‌ఖాన్ ప్రభావం ఉంది.
విలాయత్‌ఖాన్ బాణీ గాత్రాన్ని పోలే "గాయకశైలి"కిపేరు పొందినది. అంతేకాదు. ఈ "గాయక శైలి" మన దేశపు అత్యుత్తమ హిందూస్తానీ గాయకులైన అబ్దుల్ కరీంఖాన్, ఫయ్యాజ్‌ఖాన్, బడేగులాం అలీఖాన్, అమీర్‌ఖాన్ తదితరుల బాణీలపై ఆధారపడినది. అందువల్ల ఏరాగం వాయించినా అందులో లోతైన సంప్రదాయమూ, సరైన అవగాహనా,అద్భుతమైన పటుత్వమూ గోచరిస్తాయి.
తన చిన్నతనం నుంచీ ఎందరో ఉద్దండుల సంగీతం విన్న ఇమ్రత్‌ఖాన్ వారి గురించిన విశేషాలు చెప్పారు. పాత తరంవారిలో ఉస్తాద్ ఫయ్యాజ్‌ఖాన్ గురించి చెపుతూ చివరిరోజుల్లో గానకచేరీ చేస్తూ ఆయన రక్తం కక్కుకునేవారనీ, అయినా లక్ష్యపెట్టకుండా పాడేవారనీ అన్నారు. ఒక కచేరీలో బడేగులాం అలీఖాన్ అద్భుతమైన సంగతి పాడి మరెవరూ అది పాడలేరని ఫయ్యాజ్‌ఖాన్ ప్రేక్షకులలో ఉన్నప్పుడు పరోక్షంగా సవాలు చేశారట. అది విన్న ఫయ్యాజ్‌ఖాన్ దిగ్గున లేచి స్టేజి మీదికి వెళ్ళితాను కూడా అలా పాడగలనని నిరూపించారట.
రోహిణీప్రసాద్, ఇమ్రత్‌ఖాన్
సితార్ వాయించడంలో విలాయత్‌ఖాన్‌ను మించినవారు లేరని హిందూస్తానీ సంగీతాన్నీ, సితార్‌నూ బాగా ఎరిగిన చాలామంది అంటారు. వారి వంశం అక్బర్ పాదుషా కాలంనుంచీ ఎన్నోతరాలుగా సంగీతానికి పేరుపొందినది. విలాయత్‌ఖాన్ బాణీలో సితార్ వాయించే ఆయన తమ్ముడు ఇమ్రత్‌ఖాన్ అన్నగారి శిష్యుడే. ఈ అన్నదమ్ముల సంగీతం అక్షరాలా మూడు పువ్వులూ ఆరు కాయలైనట్టుగా వారి పుత్రుల, శిష్యుల ద్వారా వ్యాప్తిచెందుతోంది. విలాయత్‌ఖాన్ కుమారులు శుజాత్, హిదాయత్, ఇమ్రత్‌ఖాన్ కుమారులు నిషాత్, ఇర్షాద్, వజాహత్, షఫాతుల్లాలే కాక విలాయత్ మేనల్లుడు రయీస్‌ఖాన్, ఆయన బాబాయికి మనమడైన షాహిద్‌పర్వేజ్‌లు ఈ శైలికి అద్భుత ప్రతీకలుగా ఉన్నారు. ఇదే బాణీలో శిక్షణ పొందిన బుద్ధాదిత్య ముఖర్జీ, అరవింద్ పారిఖ్ వంటివారు కూడా మంచి కళాకారులే. రవిశంకర్ శిష్యులు చాలామంది పై విలాయత్‌ఖాన్ ప్రభావం ఉంది.
విలాయత్‌ఖాన్ బాణీ గాత్రాన్ని పోలే "గాయకశైలి"కిపేరు పొందినది. అంతేకాదు. ఈ "గాయక శైలి" మన దేశపు అత్యుత్తమ హిందూస్తానీ గాయకులైన అబ్దుల్ కరీంఖాన్, ఫయ్యాజ్‌ఖాన్, బడేగులాం అలీఖాన్, అమీర్‌ఖాన్ తదితరుల బాణీలపై ఆధారపడినది. అందువల్ల ఏరాగం వాయించినా అందులో లోతైన సంప్రదాయమూ, సరైన అవగాహనా,అద్భుతమైన పటుత్వమూ గోచరిస్తాయి.
1936లో కోల్‌కతాలో జన్మించిన ఇమ్రత్‌ఖాన్ రెండున్నరేళ్ళ వయసులోనే ఆనాటి ప్రసిద్ధ సితార్ నిపుణుడైన తన తండ్రిని కోల్పోవడంతో అన్నగారైన ఉస్తాద్ విలాయత్‌ఖాన్ ఆయనకు సితార్ నేర్పే గురువుగా బాధ్యతను చేపట్టవలసి వచ్చింది. అలాగే బాబాయి ఉస్తాద్ వహీద్‌ఖాన్ "సుర్‌బహార్" అనే వాయిద్యాన్ని నేర్పారు. "సుర్‌బహార్" సితార్‌కన్నా మంద్రస్థాయిలో గంభీరంగా మోగే వాయిద్యం. దాదాపు సితార్‌లాగే కనబడే ఈ వాయిద్యాన్ని వీరి ముత్తాత సాహబ్‌దాద్‌ఖాన్‌గారు మొదటగా తయారు చేశారు. దీనికీ సితార్‌కీ ఉండే తేడా పాశ్చాత్య వాయిద్యాలైన వయొలిన్, చెల్లోలకు ఉన్నటువంటిదే. రాగాలాపన ధ్రుపద్ శైలిలో వినిపించడానికి ఇది ఉత్తమ సాధనం. వీరి తాతగారూ, ముత్తాతగారూ దీన్ని కచ్ఛపవీణ అనే పేరుతో వాయించి ప్రఖ్యాతి గడించారు. సితార్ తీగల కన్నా సుర్‌బహార్ తీగలు దళసరిగా ఉంటాయి. సితార్‌లో ఒక మెట్టు మీద అయిదు స్వరాలు (స నుంచి ప దాకా) గుంజి పలికించవచ్చు. సుర్‌బహార్ మీదనైతే ఏడు స్వరాలు పలుకుతాయి. ఈ కారణంగా గమకాలూ, జారుడు స్వరాలూ సుర్‌బహార్ మీద అద్భుతంగా వినిపిస్తాయి.
అయిదారేళ్ళ లేత వయసునుంచీ చేసిన రాక్షస సాధన ఫలితంగా ఇమ్రత్ చేతి వేళ్ళకూ,పాదాలకూ కూడా గాయాలవుతూ ఉండేవి. మామూలు కుటుంబాల్లో అటువంటిది జరుగుతుందని ఊహించడం కూడా అసంభవం. నాలుగు శతాబ్దాలుగా సంగీతానికి పేరుమోసిన వంశానికి అప్రతిష్ఠ రాకూడదనే పట్టుదలతో ఆ అభ్యాసం కొనసాగింది. ఈనాడు సితార్, సుర్‌బహార్ రెండింటిలోనూ అద్వితీయమైన విద్వత్తు ఉన్నది ఒక్క ఇమ్రత్‌ఖాన్‌కు మాత్రమే అంటే అతిశయోక్తి కాదు. ఇమ్రత్‌ఖాన్ ఒకే కచేరీలో రెండింటినీ వాయించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. విలాయత్‌ఖాన్ సితార్, ఇమ్రత్‌ఖాన్ సుర్‌బహార్ జుగల్‌బందీ కచేరీలు నాలుగైదు దశాబ్దాల క్రితమే శ్రోతలను ఉర్రూతలూగించాయి.
ఇమ్రత్‌ఖాన్ ఎన్నో దశాబ్దాలుగా భారతదేశమంతటా పర్యటించి అనేక కచేరీలు చేశారు. ఆయన ఖ్యాతి ప్రపంచంలోని దేశాలన్నిటికీ వ్యాపించింది. 1956లో సోవియట్ యూనియన్, తూర్పు యూరప్ దేశాల పర్యటనతో మొదలైన విదేశ యాత్రలు ఆయన అంతర్జాతీయ ఖ్యాతికి నాంది పలికాయి. అమెరికా, కెనడా, బ్రిటన్, దక్షిణ అమెరికా, యూరప్, హాంకాంగ్ వగైరా ప్రదేశాల్లో ఎన్నో సంగీతోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. సంగీతకచేరీలే కాక ఇమ్రత్‌ఖాన్ అనేక దేశాల్లో భారతీయ సంగీతానికి ఉపాధ్యాయుడుగా,ఉపన్యాసకుడుగా పనిచేశారు. 1960లలో ప్రారంభించి ఇంగ్లండ్‌లోని డార్టింగ్‌టన్ కాలేజ్‌లో, బీబీసీ రేడియో,టెలివిజన్‌లో, హాలండ్, స్వీడన్, ఇటలీ,జర్మనీ మొదలైన దేశాలలో ఎన్నో ప్రతిష్ఠాకరమైన సమావేశాలూ, యూనివర్సిటీల్లో, అమెరికాలో సియాట్‌ల్ యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్‌టన్, హార్వర్డ్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజెలిస్ ఇలా ప్రపంచమంతటా ఎన్నో కోర్సులు నిర్వహించి, విడేశీయులకు మన సంగీతంపట్ల అవగాహనను పెంచారు. ఉత్తమ సంగీతకారుడై ఉండి విషయాలను చక్కగా వివరించగలిగిన నేర్పు ఉండడంతో ఆయనకు ఇటువంటి ఆహ్వానాలు ఎన్నో వచ్చాయి. ప్రస్తుతం ఆయన ఆయనకు ఎందరో అమెరికన్ శిష్యులున్నారు. వారిచేత ఆయన "ఇమ్రత్ వయొలిన్", "ఇమ్రత్ గిటార్" అనే కొత్తరకాల వాయిద్యాలను సాధన చేయిస్తున్నారు. ఇటీవల ఇమ్రత్‌ఖాన్ ముంబాయికి వచ్చిన సందర్భంగా ఆయన కొన్ని విషయాలు ముచ్చటించారు.
"కొందరు పబ్లిసిటీ కోసం సాధన చేసి దాన్ని సంపాదించుకుంటారు. అదీ ఒక కళేనేమో. నా వంటివాళ్ళు సంగీతాన్ని సాధించే ప్రయత్నంలోనే మునిగితేలుతూంటారు. వారికి పబ్లిసిటీ అంతగా రాకపోవడంలో ఆశ్చర్యం లేదు. "ఎటొచ్చీ అంగాంగ ప్రదర్శనతో సితార్ కళాకారిణులుగా పేరు సంపాదించడానికి ప్రయత్నిస్తున్న నేటి యువతులను కొందర్ని చూస్తే ఆశ్చర్యం, బాధా కలుగుతున్నాయి" అంటారు ఇమ్రత్‌ఖాన్.
గాయకీ శైలిని గురించి చెపుతూ "మెట్లూ, మీటే పద్ధతీ వగైరాల వల్ల సితార్‌వంటి తంత్రీవాయిద్యాల శబ్దానికి సామాన్యంగా పరిమితులు ఉంటాయి. ఒకసారి మీటాక తీగ కొంతసేపు మాత్రమే మోగుతుంది. పాటలో సాగినట్టుగా ఎడతెగని సంగతులు పలికించడం కష్టం. వీణ, సితార్‌వంటి వాయిద్యాలకు సహజంగా ఉండే సమస్యలివి. వాటిని అధిగమించి గాత్రాన్ని పోలినట్టు గమకాలతో వాయించడం చాలా కష్టం. మేము ప్రయత్నించే వాటిని తొలిసారిగా సితార్‌పై పలికించగలిగిన ఘనత విలాయత్‌ఖాన్‌దీ, నాదీను" అన్నారాయన.
చిన్నప్పటి విశేషాలు చెపుతూ "వాద్యసంగీతం కాక చిన్నవయసులోనే మా తల్లిగారు బషీరన్ బేగమ్, మాతామహుడైన బందేహసన్ ఖాన్‌లవద్ద నేను గాత్రసంగీతం అభ్యసించాను. నాకు సంగీతం తల్లి పాలతోనే సంక్రమించింది. అన్నట్టు 1940లలో బాల గాయకుడిగా నేను కొన్ని సినిమాల్లో పాడాను. అవి హెర్క్యులిస్, ఖిడ్కీ, హాఫ్ టికెట్ వగైరా చాలా పాతసినిమాలు. నాది చిన్న పిల్లవాడి గొంతు కనక ఆ రోజుల్లో నేను నూర్జహాన్‌ని ఇమిటేట్ చేస్తూ పాడేవాణ్ణి. పెద్దయి కీచుగొంతు పోయాక ఆ అధ్యాయం ముగిసింది" అన్నారు.
ఆయన కొన్నేళ్ళు బొంబాయి సినీపరిశ్రమలో నేపథ్య సంగీతానికి సితార్ వాయించారు. గంగా జమునా చిత్రంలో నౌషాద్‌కు "ఢూంఢో ఢూంఢోరే సాజ్‌నా" అనే పాటకు ట్యూను తానే నేర్పారు. రోషన్, మదన్‌మోహన్ వంటి పాత స్వరకర్తలతో కూడా పనిచేశారు. కోహినూర్ వగైరాల్లో నటించిన దిలీప్‌కుమార్ కొన్నాళ్ళు సితార్ నేర్చుకున్నాడు కూడా. కాని త్వరలోనే సినీ వాతావరణంతో విసుగెత్తి శాస్త్రీయ విద్వాంసుడుగా కొనసాగారు. తరవాత సత్యజిత్‌రాయి తీసిన "జల్‌సాఘర్", 1968లో జేమ్స్ ఐవరీ చిత్రం "గురు", 1976లో షబానా నటీంచిన "కాదంబరి", "విల్‌బీ కాన్స్పిరసీ" అనే హాలీవుడ్ సినిమా వగైరా చిత్రాలకు వాయించారు.
"మనవాళ్ళు ఫ్యూజన్ అంటూ శాస్త్రీయ సంగీతాన్ని సంకరం చేస్తారు. పాశ్చాత్యులు తమ శాస్త్రీయ సంగీతాన్ని యథాతథంగా కాపాడు కుంటున్నారు. జాజ్, పాప్,రాక్ వగైరాలన్నీ వారు సృష్టించుకున్నవే. దేనికదిగా వాటిని అభిమానించేవారున్నారు. అంతమాత్రాన బెఠోవెన్, మొజార్ట్‌ల సంగీతంతో రాక్,పాప్, జాజ్ వంటివాటిని కలపడం ఎప్పుడైనా చూశారా? పశ్చిమదేశాల్లో జరిగే ఇటువంటి ఫ్యూజన్ కచేరీలకి హాజరయేది మనవాళ్ళే. అక్కడివారు పట్టించుకోరు" అన్నారు ఇమ్రత్‌ఖాన్.
కర్ణాటక సంగీతం గురించి మాట్లాడుతూ "సంగీతం ప్రొఫెసర్ను గనక అమెరికాకు వచ్చే దక్షిణాది పండితుల సంగీతం వింటూనే ఉంటాను. అంత గొప్ప సంగీతం ఉన్నప్పుడు ముగ్గురేసి, నలుగురేసి తాళవాద్యకారులు వచ్చి యాంత్రికంగా ఒకరి తరవాత ఒకరు ముందుగా అనుకున్న పద్ధతిలో తాళవరసలూ, ముక్తాయింపులూ వాయించడం ఒక్కొక్కప్పుడు "అతి"గా అనిపిస్తుంది. వీణ విద్వాంసులైన ఈమని శంకరశాస్త్రి, చిట్టిబాబుల మీద నాకు చాలా గౌరవం ఉంది. చిట్టిబాబుతో జుగల్‌బందీ వాయిస్తే బాగుంటుందని అనుకునేవాణ్ణి" అన్నారు.
"పాశ్చాత్యులకు మన సంగీతాన్ని తొలిగా వినిపించినది రవిశంకర్‌గారే కదా?" అని అడిగితే ఆయన ఇలా అన్నారు. "అది తప్పు. అంతకు ముందు కొందరు చేసిన ప్రయత్నాలకు పబ్లిసిటీ రాలేదు. ఆ మాటకొస్తే మా అన్నగారూ, నేనూ రవిశంకర్ కంటే ముందే వారి ఆదరణ పొందాం. రోలింగ్ స్టోన్స్ గిటారిస్ట్ రోజర్ విలియమ్స్ నా దగ్గిర సితార్ నేర్చుకున్నాడు. అప్పటికి బీట్‌ల్స్‌కి పేరు ప్రఖ్యాతులు లేవు. నా సితార్ విన్నాక జార్జ్ హారిసన్ (బీట్‌ల్స్ గిటారిస్ట్) సితార్ నేర్చుకోవటానికి నా దగ్గరికి వచ్చాడు. అప్పటి హిప్పీ సంస్కృతి గురించీ, డ్రగ్స్ గురించీ కొందరు శ్రేయోభిలాషులు నన్ను గట్టిగా హెచ్చరించినందువల్ల నేనతన్ని అంతగా ప్రోత్సహించలేదు. ఆ తరవాత అతను రవిశంకర్ని ఆశ్రయించాడు."
రవిశంకర్, విలాయత్‌ఖాన్‌ల మధ్య జరిగిన ఒక పోటీగురించి ఆయన చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. 1954లో ఢిల్లీలో శంకర్‌లాల్ ఫెస్టివల్‌కు ఆహ్వానం అందుకుని అక్కడికి వెళ్ళిన విలాయత్, ఇమ్రత్‌ఖాన్‌లను రిసీవ్ చేసుకోవటానికి రైల్వే స్టేషన్‌కు ఎవరూ రాలేదట. దాన్ని గురించి విలాయత్‌ఖాన్ నిర్వాహకుల ఎదుట మందిపడగా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారట. "మీ కన్నా గొప్పవారు చాలామంది ఇక్కడికి వస్తారు. అందర్నీ నెత్తిన పెట్టుకోవడం మాకు వీలవదు. మిమ్మల్ని మించినవారు లేనట్టుగా మాట్లడకండి" అని వారనడంతో విలాయత్‌ఖాన్ స్వాభిమానం ఉట్టిపడేలా తాను ఎవరికీ తీసిపోననీ, ఎవరితోనైనా తలపడగలననీ సవాలు చేశారట. మాటామాటా పెరిగి ఉస్తాద్ అల్లాఉద్దీన్ ఖాన్ శిష్యులైన రవిశంకర్, అలీఅక్బర్‌లతోబాటు విలాయత్‌ఖాన్ సితార్ తీసుకుని స్టేజి మీద కూర్చున్నారట. కిషన్ మహారాజ్ తబలా వాయించిన ఆ కచేరీలో విలాయత్‌ఖాన్ రకరకాల "తాన్"లు వాయించి రవిశంకర్ని సవాలుచేశారట. ఎంత ప్రయత్నించినా అందులో రవిశంకర్‌కు పరాజయం తప్పలేదట. ఇదంతా చూసిన ఉస్తాద్ అల్లాఉద్దీన్ మండిపడి వెళిపోయారట. ఇది జరిగాక మొహం చెల్లని రవిశంకర్ విదేశాలకు వెళిపోయాడని ఇమ్రత్‌ఖాన్ అన్నారు.
"1960లలో రవిశంకర్ వుడ్‌స్టాక్ ఉత్సవంలో పాప్ కళాకారుల, హిప్పీల మధ్య సితార్ వాయించి పేరు తెచ్చుకున్నాడు. ఆ అవకాశాన్ని కోల్పోరాదని హరిప్రసాద్ చౌరసియా, శివకుమార్ శర్మ తదితరులు రవిశంకర్ శిష్యులమని చెప్పుకుని అక్కడికి వెళ్ళారు. బీట్‌ల్స్ సాంగత్యం రవిశంకర్‌కు చాలా లాభించిందనేది అందరికీ తెలుసు. నా ప్రశ్నల్లా జార్జ్ హారిసన్ రవిశంకర్ నుంచి ఏపాటి సితార్ నేర్చుకోగలిగాడని" అన్నారు ఇమ్రత్‌ఖాన్.
తన చిన్నతనం నుంచీ ఎందరో ఉద్దండుల సంగీతం విన్న ఇమ్రత్‌ఖాన్ వారి గురించిన విశేషాలు చెప్పారు. పాత తరంవారిలో ఉస్తాద్ ఫయ్యాజ్‌ఖాన్ గురించి చెపుతూ చివరిరోజుల్లో గానకచేరీ చేస్తూ ఆయన రక్తం కక్కుకునేవారనీ, అయినా లక్ష్యపెట్టకుండా పాడేవారనీ అన్నారు. ఒక కచేరీలో బడేగులాం అలీఖాన్ అద్భుతమైన సంగతి పాడి మరెవరూ అది పాడలేరని ఫయ్యాజ్‌ఖాన్ ప్రేక్షకులలో ఉన్నప్పుడు పరోక్షంగా సవాలు చేశారట. అది విన్న ఫయ్యాజ్‌ఖాన్ దిగ్గున లేచి స్టేజి మీదికి వెళ్ళితాను కూడా అలా పాడగలనని నిరూపించారట.
ఇమ్రత్‌ఖాన్‌కు ఉస్తాద్ బడేగులాం అలీఖాన్ అంటే వల్లమాలిన గౌరవం. ఉస్తాద్‌గారు ఆస్పత్రిలో పక్షవాతంవచ్చి, కోలుకుని, కళ్ళు తెరవగానే గొంతు విప్పి ఒక సంగతి పాడుకుని, "అల్లాకా శుకర్ హై" అనుకున్నారట. ఒకరోజు సాయంత్రం చీకటి పడేవేళకు ఇమ్రత్‌ఖాన్ ఆయన్నుచూడ్డానికి బొంబాయిలోని ఆయనింటికి వెళితే ఒంటరిగా పక్షవాతపు లక్షణాలతో కూర్చుని కనిపించారట. ఆయనను ఆ స్థితిలో చూసిన ఇమ్రత్‌ఖాన్‌కు కన్నీరు ఆగలేదట. ఖాన్ సాహెబుగారు మాత్రం ఏమీ అనకుండా వంకర నోటితో నవ్వి, కాస్త దూరంలో ఉన్న స్వరమండల్‌ను తన కిమ్మని సైగ చేశారట.దాని తీగలన్నిటినీ ఒంటిచేత్తో ముప్పావు గంటసేపు ట్యూన్ చేశారట. ఆ అవస్థ చూడలేక ఇమ్రత్‌ఖాన్ తాను సహాయం చేద్దామని చెయ్యిజాపితే ఖాన్ సాహెబుగారు నిప్పులు చెరిగే కళ్ళతో చూశారట. అలాగే తానే కష్టపడి శృతిచేసి నెమ్మదిగా గొంతు స్వాధీనంలోకి తెచ్చుకుంటూ పాడసాగారట. పాటే ఆయనకు ప్రాణం.
"బడేగులాం అలీగారి పాటలో పర్ఫెక్షన్ ఉంటుంది. ఆయన గొంతు వింటే ఏ స్వరం, ఏ గమకం ఎలా వినబడాలో తెలుస్తుంది. అతి సామాన్యంగా అనిపించే ఆయన రాగాలాపనలో ఇతరులకు సాధ్యం కానివెన్నో కనిపిస్తాయి" అంటారు ఇమ్రత్‌ఖాన్. అమీర్‌ఖాన్ శైలిలో ఎంతో ఆలోచన కనిపిస్తుందనీ, రాగం పోకడలు ఎప్పటికప్పుడు కొత్తమలుపులు తిరుగుతూంటాయనీ అన్నారు.
తన ప్రస్తుత వ్యాపకాలను ప్రస్తావిస్తూ ఇమ్రత్‌ఖాన్ "అమెరికాలో ఉంటున్నా నా ఆత్మ మన సంగీతాన్నే ఆశ్రయించుకుని ఉంది. ఎటొచ్చీ ఆదాయానికి లోటులేదు. నాకు మన దేశంలో పేరూ, డబ్బూ కోసం పాకులాడే ధోరణీ, ఓపికా లేవు. మరొక ప్రణాళిక ఉంది. మొగలుల కాలం నుంచీ మన సంగీతంలో జరిగిన, జరుగుతున్న పరిణామాల గురించి, సంగీత శాస్త్రవేత్తలా కాకుండా సంగీతకారుడి దృక్పథంతో ఒక గ్రంథం రాయదలిచాను. అందులో నాకు తెలిసిన విషయాలను సంగీతాభిమానులతో ముచ్చటించుకుంటాను" అన్నారు.